Bandi Sanjay: ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.. ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన ఆయన.. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్‌దే అని విమర్శించారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించిన ఆయన.. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ దుయ్యబట్టారు.. ఇప్పుడు ఏపీలో బీజేపీని హేళన చేసినట్టే గతంలో దేశవ్యాప్యంగా బీజేపీని హేళన చేశారు.. ఏమైంది? హేళన చేసిన పార్టీలే నామ రూపాల్లేకుండా పోయాయని సెటైర్లు వేశారు. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమన్న ఆయన.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయని మండిపడ్డారు.
డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో రెండు రాష్ట్రాల్లో దోపిడీ జరుగుతుందన్నారు బండి సంజయ్.. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది.. ఏపీలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సారి వైసీపీ అధికారంలోకొచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారని.. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందన్నారు. అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. మీరంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కల్యాణ్ ఎన్డీఏలో చేరారని తెలిపారు బండి సంజయ్.. పవన్ ప్రజాభిమానం ఉన్న నేత.. ప్రజా సమస్యలపై జనంలోకి వెళ్తుంటే ఆయనను అడ్డుకోవడం దారుణమైన విషయం అన్నారు. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ, ఇవాళ నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. మన మధ్య మనస్పర్థల్లేవ్.. అందరం బాగుండాలని అనుకుంటున్నాం. కానీ, ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి.. మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.