Bandi Sanjay Hot Comments: తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీలను సాక్ష్యులుగా చేర్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని కోరారు. ఇదే విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఈరోజు సాయంత్రం రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్ లోని మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో బండి సంజయ్ మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వస్తున్న ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమని.. సీఎం ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ముఖ్యమంత్రి హోదాలో స్వాగతం పలకాలనే సంస్కారం కూడా లేని మనిషి కేసీఆర్ అంటూ మండిపడ్డరు. గతంలోనూ ఇంతే.. ఒకసారి కోవిడ్ అంటడు. ఇంకోసారి జ్వరం అంటడు.. మరోసారి ఢిల్లీ అంటడు… ఇట్లా సాకులు చెబుతూ ప్రోటోకాల్ పాటించని మూర్ఖుడని ఆగ్రహం వ్యక్తం చేశాడు బండిసంజయ్.
Read Also: Huzurnagar: నకిలీ జామీన్ తయారీదారుల గుట్టురట్టు.. విచారణలో నమ్మలేని నిజాలు
తెలంగాణకు అన్యాయం జరిగింది…. కేంద్రం నిధులివ్వడం లేదని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్… అదే నిజమైతే ప్రధానమంత్రే స్వయగా రాష్ట్రానికి వస్తున్నారు కదా… ఆయనను నేరుగా కలిసి ఎందుకు అడగటం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికైనా ప్రధాని పర్యటనను వేదికగా చేసుకోవచ్చు కదా… అయినా రావడం లేదంటే ప్రధానికి ముఖం చూపలేకనే కమ్యూనిస్టులతో కలిసి ప్రధాన పర్యటనను అడ్డుకునే కుట్ర చేస్తున్నరంటూ బండి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతులందరికీ యూరియా ఫ్రీగా అందిస్తానన్న హామీకి సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతి తక్కువ ధరకు యూరియాను రైతులకు సబ్సిడీపై అందిస్తున్నారని తెలిపారు. అంతేగాకుండా గతంలో మాదిరిగా యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పనిలేకుండా చేస్తున్నారని కితాబిచ్చారు. మోదీ దేశంలో యూరియా కొరత లేకుండా చేసేందుకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క టన్ను యూరియాకు 40 వేలు ఖర్చవుతుంటే ఏకంగా 35 వేల సబ్సిడీ ఇస్తూ రైతులకు రూ. 5 వేలకే అందిస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు.
Read Also: MLA Purchasing Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు
వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్నారు? ఆ పని చేయొద్దని అడ్డుకోవాలనుకుంటున్నారా?.. దేనికోసం అడ్డుకోవాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న కమ్యూనిస్టులు ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని చూడటం సిగ్గు చేటన్నారు. బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారా? జీతాలు, పెన్షన్లు సక్రమంగా ఇస్తున్నారా? దేనికోసం సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నారో కమ్యూనిస్టులు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Read Also:Uttar Pradesh: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెళ్తే.. కిడ్నీనే మాయం చేశారు
గతంలో కేసీఆర్ నయీం కేసు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్, మియాపూర్ భూములు, డ్రగ్స్ కేసు వంటి అంశాలన్నింటిపైనా సిట్ వేశారు. కానీ ఆ విచారణలు ఏమయ్యాయి? కేవలం సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం తప్ప చేసిందేమిటి? ఎవరికి న్యాయం జరిగింది? నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ అన్నారు. సీఎం అవినీతి, అక్రమాలపై ఆధారాలు సేకరిస్తున్నాం. తప్పకుండా విచారణలు జరుగుతాయి. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని బండి సంజయ్ వెల్లడించారు.