Huzurnagar: హుజూర్ నగర్ నియోజకవర్గంలో నకిలీ జామీనులు తయారు చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామపంచాయతీలకు సంబంధించి నకిలీ రబ్బర్ స్టాంప్ లు, దొంగ ఇంటి పన్నుల రిసిప్ట్ పేపర్లు సృష్టించి కొత్త దందాకు తెర తీశారు. పంచాయతీ కార్యదర్శుల ఫోర్జరీ సంతకాలతో పలువురు నేరస్తులకు నకిలీ జామీన్లు ఇప్పిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కేటుగాళ్లకు పలువురు లాయర్లు సహకరించడం కొసమెరుపు. కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణం ఇందిరా గాంధీ సెంటర్లో తమ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా కోర్టు దగ్గర నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారన్నారు. వారిని విచారించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారన్నారు. మరింత లోతుగా విచారిస్తే విస్తుపోయే నిజాలు తెలిసి అవాక్కయ్యారని తెలిపారు.
Read Also: MLA Purchasing Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు
ఈ దొంగ పత్రాలను సృష్టించడం కోసం కొందరు ఓ ముఠాగా ఏర్పడ్డారని వారిలో ప్రధాన నిందితులైన కస్తాల గోపి, మామిడి భాను ప్రకాష్ ఒక్కో నకిలీ జామీన్లలకు రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ జామీన్లలను అడ్వకేట్ల ద్వారా నిందితులకు ఇప్పించడం జరుగుతుందన్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన కొందరు పేదలు ఇట్టి డబ్బుకి ఆశపడి కరుడుగట్టిన నేరస్తులకు బెయిల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 43 మందికి ఇలా దొంగ జామీన్లు ఇప్పించారని పేర్కొన్నారు. బెయిల్ కు సంబంధించిన అన్ని పత్రాలు కూడా స్వయంగా ఈ అక్రమానికి ఒడిగడుతున్న ముఠానే తయారు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది… ఇంటి పన్ను తో సహా అగ్రిమెంట్లు, స్టాంపులు అన్నీ కూడా ఈ అక్రమార్కులే తయారు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 22 మందిని అరెస్ట్ చేశామని ఈ కేసులో సంబంధమున్న మిగతా 20 మందిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. నిందితులపై సెక్షన్ 420-417-468 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.