టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్.ఆర్.ఆర్(RRR) సినిమా గురించి ప్రస్తావించారు. నవంబర్ 2న RRR సినిమా స్పెషల్ షో ప్రగతి భవన్ ముందు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఆరోజు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రానుందని.. ఆరోజు బాక్స్ బద్దలు అవుతుందన్నారు. అయితే బండి సంజయ్ RRR సినిమా అంటే రాజమౌళి సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు బండి సంజయ్ RRR సినిమా ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారంటే..
ఇప్పటికే అసెంబ్లీలో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో రాజాసింగ్, రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ రావు గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరి సరసన ఈటెల రాజేందర్ కూడా చేరతారని బీజేపీ విశ్వాసంతో ఉంది. అందుకే RRR అని బండి సంజయ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో తమకు రాజాసింగ్, రఘునందన్ ఉన్నారని.. ఇక రాజేందర్ రానున్నారని, కేసీఆర్‌కు ఇక RRR సినిమా కనిపిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.