పదో తరగతి హిందీ పరీక్షాపత్రం లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్.. తాజాగా తన ఫోన్ పోయినట్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే.. ఈ విషయం గురించి బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది నాతో మాట్లాడారని, ఆ విషయం తెలిసి కేసీఆర్ మూర్చపోయినట్లున్నారని ఆయన సెటైర్లు వేశారు. నా ఫోన్ బయటకొస్తే చాలా విషయాలు తెలుస్తాయని తన వద్దే పెట్టుకున్నట్లున్నారని, లీగల్ సెల్ నేతలతో భేటీలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ లీగల్ విభాగం నేతలతో బండి సంజయ్ సమావేశమై బీజేపీ చేస్తున్న పోరాటాలపై కేసీఆర్ ప్రభుత్వ నిర్బంధం, కార్యకర్తలపై అక్రమంగా పెడుతున్న కేసుల అంశంపై చర్చించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలపై మరింత నిర్బంధాలు పెరగడంతోపాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ తెలిపారు. ఈ తరుణంలో బీజేపీ లీగల్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కోరారు.
Also Read : SRH vs PBKS: నిదానంగా ఆడుతున్న హైదరాబాద్.. 10 ఓవర్లలో స్కోరు ఇది
‘‘మీరున్నారనే ధైర్యం… కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నరు. మీరు మాకు అండగా ఉండండి. అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా స్పందించండి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కార్యకర్తల పక్షాన నిలబడండి.’’ అని కోరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించేలా తిడతారు. ఆయన దిష్టిబొమ్మలను తగలబెడతారు. వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారు. కేసీఆర్ ను తిడితే మాత్రం నాన్ బెయిలెబుల్ కేసు పెడతారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడతారు. పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారు. అట్లా చేసి కేసీఆర్ మెప్పు పొంది ప్రమోషన్లు పొందేందుకు కొందరు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారు’’అని అన్నారు.