నందమూరి నటసింహం బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ లో నాలుగో ఎపిసోడ్ శుక్రవారం జనం ముందు నిలచింది. ప్రోమోలో చూపినట్టుగా ముందు ఈ ఎపిసోడ్ లో తన స్నేహబంధం గురించి చెప్పారు. తన మిత్రుడు ఒకరు సివిల్స్ లో ఫెయిల్ అయి సూసైడ్ చేసుకోవాలని భావించి, ఫోన్ చేసినప్పుడు తాను పార్టీ చేసుకుందామని తీసుకువెళ్ళగా, అక్కడ ఎంతోమంది ఇతర మిత్రులను చూసి, అభిప్రాయం మార్చుకున్నాడని ఫ్లాష్ బ్యాక్ చెప్పారు బాలయ్య. తరువాత తన మిత్రుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు బాలయ్య. “నువ్వు నాకంటే వయసులో పెద్దోడివి. నా సీనియర్ వి కదా…” అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అలా వయసు గుర్తు చేయడమే బాగుండదని బాలయ్య చెప్పారు. ఆయన దారి వేరు, నా దారి వేరు ఆయన వివాద రహితుడు, నేను వివాద సహితుడిని అంటూ బాలయ్య అనడం అందరినీ అలరించింది. అమ్మాయిల వెంటపడే టైమ్ లేదని, తాను సీరియస్ గా క్రికెట్ అడేవాడినని కిరణ్ వివరించారు. అజారుద్దీన్ తన ఆటోబయోగ్రఫీలో కిరణ్ గురించి రెండు పేజీలు రాశారని గుర్తు చేసుకొని ఆనందించారు. ఈ సందర్భంగా చిన్నతనంలో తాము డబ్బుకు ఎలా ఇబ్బంది పడిందీ గుర్తు చేసుకొని మిత్రులు నవ్వుకున్నారు.
Also Read : Itlu Maredumilli Prajaneekam Movie Review: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రివ్యూ
తాను ఎమ్మెల్యేగా పదిహేను సంవత్సరాలు పూర్తయ్యాక స్పీకర్ అయ్యానని, ఆ తరువాతే సీఎమ్ అయ్యానని ఫ్లాష్ బ్యాక్ వివరించారు కిరణ్ కుమార్ రెడ్డి. తరువాత మరో మిత్రుడు, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి జాయిన్ అయ్యారు. అమ్మాయిలకు సైట్ కొట్టడంలో బాలయ్యను ఎవర్ గ్రీన్ హీరో అని సురేశ్ రెడ్డి అభివర్ణించారు. అమ్మాయిల సైట్ కొట్టే విధానాన్ని సురేశ్ రెడ్డి వివరిస్తున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి “మీ టైటిల్ కూడా అన్ స్టాపబుల్ జస్టిఫై అవుతుంది” అని అన్నారు. వసుంధర (బాలకృష్ణ భార్య), పద్మజ (సురేశ్ రెడ్డి భార్య) క్లాస్ మేట్స్ అని, తరువాత తమ కూతుళ్ళు, ఇప్పుడు మనవళ్ళు కూడా క్లాస్ మేట్స్ కావడం విశేషమని బాలయ్య చెప్పారు. మిత్రులు కూడా రాజకీయాల్లో ఉన్నారు, అలాగే తానూ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నందున రాజకీయరంగంలో ఎవరెవరు ఎలా మారారు అని వివరించుకోవడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సురేశ్ ఎలా స్పీకర్ అయింది, కిరణ్ ఎలా ఛీఫ్ విప్ అయ్యాడో వివరించడమూ ఆసక్తిగా సాగింది. కేసీఆర్ లీడర్ షిప్ గురించి సురేశ్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఇక్కడ పాలిటిక్స్ ఎందుకు అని కిరణ్ అనగానే, ‘బాలకృష్ణ కూడా అప్పుడప్పుడూ తప్పులు చేస్తుంటాడు. కాబట్టి, ఫ్రెండ్స్ ను పిలిచి పాలిటిక్స్ ఏంటి?” అంటూ బాలయ్యనే టాపిక్ మార్చారు. తరువాత మిత్రులు సరదాగా ఆ వేదికపైనే క్రికెట్ ఆడడమూ అలరిస్తుంది.
Also Read : Manjima Mohan : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మలయాళ ముద్దుగుమ్మ
ఈ ముగ్గురు మిత్రులూ ఉండగా, రాధిక ఎంట్రీ ఇచ్చారు. మిత్రులను తన ప్రశ్నలతో ఆమె ఉక్కిరిబిక్కిరి చేస్తూ వినోదం పంచారు. తరువాత రాధికకూ బ్యాట్ ఇచ్చి భలేగా సందడి చేశారు. “చిరంజీవిలో మీకు నచ్చనిదేంటి? నాలో నీకు నచ్చేదేంటి?” అన్న ప్రశ్నకూ రాధిక ఇచ్చిన సమాధానం మురిపించింది. కిరణ్ కుమార్ రెడ్డిని ‘మూడు రాజధానుల గురించి’ ప్రశ్నించగా, ఆయన సమాధానం ఒక రాజధానికే జై కొట్టినట్టుగా వచ్చింది. ‘ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ప్రజల సంక్షేమానికి వీలుంటుందని’ సురేశ్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘పిల్లలు కనాలంటే పెళ్ళి చేసుకొని తీరాలా?’ అన్న ప్రశ్నకు ‘న్యూ జెనరేషన్ మైండ్ సెట్ మారిపోయిందని, కొందరు సరోగసీపై మనసు పడుతున్నారనీ’ రాధిక చెప్పారు. రాధిక అందరికన్నా ఆలస్యంగావచ్చి, ముందుగా నిష్క్రమించారు.
అదే వేదికపై స్నేహానికి ప్రాణమిస్తున్న హిమజ ఏవీ ప్రదర్శించారు. తనకు అక్క, తమ్ముడు ఉన్నారని, వారిద్దరినీ తమ వద్ద ఉంచుకొని చిన్నప్పుడు తననెందుకు హోమ్ లో ఉంచారో అర్థం కాలేదని ఆమె చెప్పారు. ఆమె దివ్యాంగురాలు కావడమే కారణమని తరువాత తెలిసిందని, అప్పటి నుంచీ జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకొని, ఇప్పుడు తానే ‘హోప్ ఫర్ లైఫ్’ నడుపుతున్నానంటూ ఎవరికాళ్ళపై వాళ్ళు నిలబడగలిగేలా చేయడమే తన లక్ష్యమని హిమజ చెప్పారు. ఈ సందర్భంగా తమ సంస్థ ద్వారా చేసిన సేవలు వివరించారామె. ఆమెను మిత్రులు ముగ్గురూ ఎంతగానో అభినందించారు. వెళ్తూ “నీ రాబోయే సినిమాలు సక్సెస్ కావాలి” అని కిరణ్ అభిలషించారు. ఇలాంటి విశేషాలతో రూపొందిన ‘యన్బీకే అన్ స్టాపబుల్’ సీజన్ 2లోని ఎపిసోడ్ 4 ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. వీక్షించే వారికి వినోదంతో పాటు మిత్రుల మధురజ్ఞాపకాలూ మురిపిస్తాయి.