Ayyappa Mala Row: విజయవాడ నగరంలోని భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్‌లో ఉన్న బెజవాడ రాజారావు స్కూల్‌లో వివాదం నెలకొంది. 5వ తరగతి, 3వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అయ్యప్ప స్వామి మాల ధరించి పాఠశాలకు వచ్చారు, స్కూల్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపింది. మాల వేసుకున్న కారణంగా స్టూడెంట్స్ ను తరగతి గదిలోకి రాకుండా అడ్డుకోవడంతో.. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ రాజారావుని ప్రశ్నించగా, వారిపై దురుసుగా ప్రవర్తించారు ప్రధానోపాధ్యాయుడు. దీంతో స్థానిక అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రిన్సిపాల్ తన వైఖరి మార్చుకోకుండా, స్వామి మాలలో వస్తే స్కూల్‌కి రావద్దని స్పష్టంగా చెప్పారు. దీంతో స్వాములకు, ప్రిన్సిపాల్‌కు మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది.
Read Also: Airtel Recharge Plan: అపరిమిత 5G డేటా, ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్.. అన్నీ ఒకే ప్లాన్‌లో
అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యం తమ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు 3 రోజుల సమయం ఇవ్వాలని కోరింది. డీఈఓకి ఈ విషయంపై లేఖ పంపాం.. డీఈఓ నుంచి రిప్లై వచ్చిన తర్వాతే విద్యార్థులు మాలలో స్కూల్ కి రావడానికి అనుమతించాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయిస్తామని పాఠశాల యాజమాన్యం పోలీసులకు తెలియజేసింది. ఇక, పోలీసుల హామీ మేరకు అయ్యప్ప స్వాములు తమ ఆందోళనను విరమించుకున్నారు.