కొత్త ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఆరంభం అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టాడు. ఈ గ్రాండ్‌స్లామ్ గెలిస్తే టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా జాకో చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్‌తో సమానంగా టైటిళ్లు 24 సాధించాడు. ఆ ఒక్కటీ గెలవాలన్న జాకో ఆశతో అతడు బరిలోకి దిగుతున్నాడు. చరిత్రకు టైటిల్ దూరంలో ఉన్న 37 ఏళ్ల జొకో.. కొత్త కోచ్ ఆండీ ముర్రేతో ఈ టోర్నీకి సిద్ధమయ్యాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో నొవాక్ జొకోవిచ్‌కు గట్టి పోటీ తప్పదు. ప్రపంచ నంబర్‌వన్ సినర్ (ఇటలీ), అల్కరాస్ (స్పెయిన్) టైటిల్‌కు బలమైన పోటీదారులుగా ఉన్నారు. 21 ఏళ్ల వయసులోనే సినర్ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను సాధించాడు. 2024 సీజన్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సినర్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న సినర్ ఈ టోర్నీలో ఫేవరెట్. 21 ఏళ్ల అల్కరాస్ కూడా ఫేవరెట్. నిరుడు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన అతడు కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. జ్వెరెవ్, ఫ్రిట్జ్ (అమెరికా), మెద్వెదెవ్ (రష్యా), రూడ్ (నార్వే) కూడా గట్టిపోటీదారులే.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ అరియానా సబలెంక (బెలారస్) ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 26 ఏళ్ల ఈ టాప్‌సీడ్ వరుసగా మూడో ఆస్ట్రేలియన్ ఓపెన్‌పై కన్నేసింది. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)తో తొలిరౌండ్‌లో తలపడనుంది. రెండో సీడ్ ఇగా స్వైటెక్ (పోలెండ్), మూడో సీడ్ కొకో గాఫ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఈ ముగ్గురు ఎలా ఆడుతారో చూడాలి.