Josh Hazlewood, Travis Head give Australia 1-0 Series Lead: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇటీవల పాకిస్తాన్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. తాజాగా వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ల్లో 10 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండు ఇన్నింగ్స్‌లలో (9/79) చెలరేగగా.. స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ తొలి ఇన్నింగ్స్‌లో (119) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. హాజిల్‌వుడ్ దాటికి ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. అయితే కఠినమైన పిచ్‌పై సెంచరీ చేసిన హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 188 పరుగులకే ఆలౌట్ అయింది. జోష్ హాజిల్‌వుడ్ (4/44), ప్యాట్ కమిన్స్ (4/41) దాటికి విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. కిర్క్ మెక్‌కెంజీ (50) టాప్ స్కోరర్. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) చేయడం విశేషం. బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరశపర్చారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 283 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ సెంచరీ చేశాడు. షమార్ జోసఫ్ (5/94) ఐదు వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Salaar OTT Release Date: అభిమానులకు శుభవార్త.. ‘సలార్’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
95 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. హాజిల్‌వుడ్ దాటికి మరోసారి విఫలమైంది. హాజిల్‌వుడ్ ఐదు వికెట్స్ తీయడంతో విండీస్ 120 పరుగులకే చాపచుట్టేసింది. కిర్క్ మెక్‌కెంజీ (26) టాప్ స్కోరర్. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఉస్మాన్ ఖ్వాజా (9) రిటైర్డ్ హర్ట్ కాగా.. స్టీవ్ స్మిత్ (11), మార్నస్ లబూషేన్ (1) అజేయంగా నిలిచారు. ఇక రెండో టెస్ట్ జనవరి 25 నుంచి ఆరంభం అవుతుంది.