మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. అడిలైడ్ వన్డేలో గెలిస్తేనే మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అవుతుంది. రెండో వన్డేలో అందరి కళ్లు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైనే ఉన్నాయి. తొలి వన్డేలో ఇద్దరూ విఫలమైన సంగతి తెలిసిందే. అడిలైడ్‌లో అయినా రో-కోలు రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే అడిలైడ్ ఓవల్ రోహిత్‌కు పెద్దగా కలిసిరాదనే చెప్పాలి.
Also Read: Virat Kohli: మరో 25 పరుగులే.. అడిలైడ్‌లో ‘కింగ్’ మనోడే!
రోహిత్ శర్మ అడిలైడ్ మైదానంలో మంచి ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. ఇప్పటి వరకు ఆరు వన్డేల్లో 147 పరుగులు మాత్రమే చేశాడు. హిట్‌మ్యాన్‌గా పేరున్న రోహిత్ అడిలైడ్‌లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేయలేదు. 2019లో చేసిన 43 పరుగులే ఈ మైదానంలో హిట్‌మ్యాన్‌కు వ్యక్తిగత అధిక స్కోర్. మొదటి వన్డేలో రోహిత్ 14 బంతులు ఎదుర్కొని.. 8 పరుగులు మాత్రమే చేశాడు. అసలే కలిసిరాని మైదానంలో ఎలా రాణిస్తాడో చూడాలి. ఈ సిరీస్‌లో రాణించకుంటే రోహిత్ వన్డే కెరీర్ ప్రమాదంలో పడే చాన్స్ ఉంది. ఈ సిరీస్ అతడి వన్డే భవిష్యత్తును నిర్ణయించనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.