కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు నగరాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. కొట్టాయం జిల్లాను వరదలు ముంచెత్తాయి. జిల్లాలో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. వరద ధాటికి… ఇళ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. ఓ ఇల్లు కళ్ల ముందే… కూలిపోయిన దృశ్యాలు… అక్కడి వరద బీభత్సాన్ని కళ్లకు కడుతోంది. ముంపు ప్రాంతాల్లో NDRF బలగాలు, ఆర్మీ సిబ్బంది, భారత వాయుసేన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నాయి.కొట్టాయం జిల్లా కూట్టికల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది. ఇంకా పలువురు కొండచరియల కింద ఇరుక్కుపోయారు. ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.