ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇండియన్ ఫాన్స్ డిమాండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో, మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాను పట్టించుకోలేదు.
టాస్ సమయంలో కెప్టెన్ సల్మాన్ అఘాకు సూర్యకుమార్ యాదవ్ కరచాలనం ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సూర్య మాట్లాడుతూ.. తాము కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం అని, పాక్‌కు సరైన సమాధానం ఇచ్చామని తెలిపాడు. జీవితంలో కొన్నిసార్లు క్రీడాస్ఫూర్తి కంటే ముందుండే విషయాలు ఉంటాయన్నాడు. భారత్ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు సూర్య వెల్లడించాడు. బీసీసీఐ, భారత ప్రభుత్వంతో కలిసి తాము పని చేస్తున్నాం అని.. అందుకే కరచాలనం ఇవ్వలేదని స్పష్టం చేశాడు.
Also Read: IND vs PAK: ఓర్నీ మీ దుంపతెగ.. మ్యాచ్ వద్దంటూనే ఇంతమంది పోయారేంట్రా!
మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పాల్గొనలేదు. దీనిపై పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. మ్యాచ్ ముగింపులో భారత జట్టు ప్రవర్తన నిరాశపరిచిందని, అందుకే పాక్ కెప్టెన్ ప్రెజెంటేషన్‌లో పాల్గొనలేదని చెప్పాడు. భారత జట్టు ప్రవర్తనకు తాము కూడా నిరసన (ప్రెజెంటేషన్‌లో పాల్గొనకుండా) వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ అక్తర్ చీమా తెలిపాడు. అలానే మ్యాచ్ రిఫరీ ప్రవర్తనపై కూడా నిరసన వ్యక్తం చేశాడు. భారత జట్టు ప్రవర్తన పట్ల ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్)కి చీమా ఫిర్యాదు చేసినట్లు పాక్ పత్రిక డాన్.కామ్ ధృవీకరించింది. మొత్తం మీద మ్యాచ్‌లో నో హ్యాండ్‌షేక్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది.