ఆసియా కప్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరోసారి కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-4 దశలో దాయాది పాకిస్థాన్‌తో ఈరోజు రాత్రి 8 గంటలకు టీమిండియా తలపడనుంది. గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన సూర్య సేన.. మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాక్ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అనే చెప్పాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం కొందరు భారత్ ప్లేయర్స్ నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చారు. అందులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు.
శనివారం ఆప్షనల్ నెట్ సెషన్స్‌ను టీమిండియా మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది. శుక్రవారమే ఒమన్‌తో మ్యాచ్ ఆడిన నేపథ్యంలో చాలామంది ప్లేయర్స్ డుమ్మా కొట్టారు. వరుసగా విఫలమైన శుభ్‌మన్ గిల్ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఆసియా కప్ 2025లో సంజు శాంసన్ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన గిల్.. మూడు మ్యాచ్‌లలో భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. పసికూన ఒమన్‌పై కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. సూపర్-4లో ఈరోజు పాకిస్థాన్‌పై ఆడనుండటంతో గిల్‌పై ఒత్తిడి పెరిగింది. నెట్స్‌లో అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించుకుని గిల్ సాధన చేశాడు. ఐతే ఫ్లైటెడ్ డెలివరీలను స్వీప్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా లాఫ్ట్ షాట్లు ఆడాలని గిల్‌కు అభిషేక్ సూచించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read: Navratri 2025: దేవీ శరన్నవరాత్రులు.. ఉపవాస సమయంలో తప్పక తినాల్సిన ఆహరం ఇదే!
ఒమన్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆప్షనల్ సెషన్‌కు హాజరయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో గిల్‌కు అతడు బౌలింగ్ చేశాడు. వరుణ్ బౌలింగ్‌లో కూడా గిల్ ఇబ్బంది పడ్డాడు. మిస్టరీ బంతులకు భారీ షాట్లను కొట్టలేకపోయాడు. ఒకటి, రెండు షాట్లు తప్ప చక్రవర్తిపై ఆధిపత్యం చెలాయించలేకపోయాడు. అయితే పేసర్ల బౌలింగ్‌లో మాత్రం గిల్ దూకుడుగా ఆడాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడుతున్న గిల్.. పాక్‌పై ఎలా ఆడతాడో చూడాలి. ఇవాళ కూడా విఫలమైతే తదుపరి టీ20 సిరీస్‌లో ఉండడం కష్టమే.