ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్-ఏ టీమ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బీలో భాగంగా బుధవారం అల్ అమెరత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్-ఏ జట్టును భారత్ ఢీకొంటుంది.
ఈ మ్యాచ్‌లో మొదట ఒమన్ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మహ్మద్ నదీమ్ (41; 49 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. హమ్మద్ మీర్జా (28) రాణించాడు. రసిఖ్ సలామ్ (1/23), సాయి కిశోర్ (1/21) ఒమన్‌ను కట్టడి చేశారు. మోస్తరు లక్ష్యాన్ని భారత్-ఏ 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆయుష్ బదోని (51; 27 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీ చేయగా.. తిలక్ వర్మ (36 నాటౌట్; 30 బంతుల్లో 1×4, 2×6), అభిషేక్ శర్మ (34; 15 బంతుల్లో 5×4, 1×6) రాణించారు.
Also Read: IND vs NZ 2nd Test: నేటి నుంచే రెండో టెస్టు.. రాహులా, సర్ఫరాజా!
ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. ఒమన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రయించింది. గ్రూప్-బీలో పాకిస్తాన్ రెండు విజయాలతో సెమీస్ చేరింది. ఇక గ్రూప్-ఏలో శ్రీలంక, అఫ్గానిస్థాన్‌లు సెమీస్ చేరాయి. బంగ్లాదేశ్, హాంకాంగ్, యూఏఈలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.