Asaduddin Owaisi: గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నేత అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను గతవారం పోలీసుల కస్టడీలోనే మీడియా ముందు దారుణంగా తుపాకులతో కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కొత్త ప్రశ్నలను లేవనెత్తారు. అతీఖ్, అష్రఫ్‌లను హత్య చేసేందుకు నిందితులకు లక్షల ఖరీదైన ఆటోమేటిక్ తుపాకులను ఎవరు ఇచ్చారని ఒవైసీ ప్రశ్నించారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనల అనంతరం మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రశ్నలను లేవనెత్తారు. హంతకులు ఇంకా ఎంతో మందిని చంపే అవకాశం ఉందని.. అలాంటి వారిపై దేశద్రోహ చట్టం కానీ, జాతీయ భద్రతా చట్టం కానీ ఎందుకు ప్రయోగించలేదని ఒవైసీ ప్రశ్నించారు.
Read Also: Chris Messina: ట్విట్టర్‌ను విడిచిపెట్టిన హ్యాష్‌ట్యాగ్‌ల సృష్టికర్త
సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని, ఉత్తరప్రదేశ్‌లో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో అతీఖ్, అష్రఫ్ హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సర్వేలెన్స్‌లో ఉన్న 1000 ఫోన్ నెంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. వీటిలో చాలా నెంబర్లు ఆఫ్ ఉండటాన్ని పోలీసులు గమనించారు. హంతకులు బస చేసిన హోటల్ వద్ద సిట్ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పటికే సిట్ తాత్కాలిక నివేదిక ఆధారంగా అశ్వనీ కుమార్ సింగ్‌ను, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్‌లను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా హత్య చేసిన ముగ్గురికి ప్రాణ హాని ఉందని పోలీసుల నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో వారి భద్రతను కట్టుదిట్టం చేశారు.