కర్నూలు జెడ్పీ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం సూటిగా చెప్పాలని ఎమ్మెల్యే పార్థ సారథికి జెడ్పీ చైర్మన్ సూచించారు. రైతు సమస్యలపై చర్చించే ఓపిక లేకుంటే ఎలా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టైం లేకుంటే మీరు వెళ్లిపోండని, తాము చర్చించుకుంటాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. అసెంబ్లీలో సభ్యుల కంటే అధ్యక్ష స్థానంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఎక్కువగా మాట్లాడతారు. ఇది మాకు సమస్య. జెడ్పీ సమావేశంలో చైర్మన్ అలాగే మాట్లాతున్నారు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి, అడ్డుకుంటే ఎలా?’ అని ఎమ్మెల్యే పార్థ సారథి అన్నారు. సభా మర్యాదలు పాటించాలని, సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేను అందరిని సమన్వయం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి బదులిచ్చారు. ఇక జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల్లో.. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మాత్రమే హాజరయ్యారు. హాజరైన జెడ్పీటీసీ, ఎంపీలు పూర్తిస్థాయిలో హాజరయ్యారు.
‘కర్నూలులో ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేరిన రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఆపరేషన్లలో ఆలస్యం చేస్తున్నారు. లాగిన్ కాలేదు, అది లేదు ఇది లేదు అంటూ ఎన్ఠీఆర్ వైద్య సేవ కింద అపరేషన్లు చేయడంతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే త్వరగా ఆపరేషన్లు చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే పార్థ సారథి మండిపడ్డారు.