ఆ ఎంపీలు పొలిటికల్‌గా ఎందుకు యాక్టివ్ మోడ్‌లో కనిపించడం లేదు? లేనిపోని విషయాల్లో వేలుపెట్టి నెత్తి మీదికి తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ఇతర కారణాలున్నాయా? టిక్కెట్స్ ఇచ్చి గెలిపించిన పార్టీ నాయకత్వంపై ప్రత్యర్థులు దాడి చేస్తున్నా మౌనంగా ఎందుకు ఉంటున్నారు..? ఎవరు వాళ్ళు? ఏంటా మ్యూట్ మేటర్?
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 సీట్లు గెల్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్నికల టైంలో, గెలిచిన కొత్తల్లో తప్ప… తర్వాత ఎప్పుడూ గాంధీభవన్ ముఖం చూసిన పాపాన పోలేదు మెజార్టీ లోక్‌సభ సభ్యులు. ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాలంటే… మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ యాక్టివ్‌గా కనిపించడం లేదన్నది పార్టీ టాక్. అసలు వాళ్ళంతా కాంగ్రెస్ వ్యవహారాలతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారట. గాంధీభవన్‌లో మీటింగ్ ఉంది. ఖచ్చితంగా రావాలని అంటే తప్ప ఆ ఆరుగురు ఎంపీలు కనిపించే పరిస్థితి లేదంటున్నారు. ఒకరిద్దరైతే….ముఖ్యమంత్రి ఉంటే తప్ప… గాంధీభవన్లోగాని, పార్టీ ఇతర కార్యక్రమాల్లోగానీ కనిపించడం లేదట. సరే… పార్టీ ఆఫీస్‌కి రావడం, రాకపోవడం అన్నది వాళ్ళ ఇష్టంగానీ…. కనీసం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న టైంలో కూడా నోరు తెరవకపోతే ఎలాగన్నది మెయిన్ క్వశ్చన్. రోజుకోరకమైన ఇష్యూతో అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం.
సీఎం రేవంత్ రెడ్డి మీద, ప్రభుత్వ పథకాల అమలుపైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ… వీటి మీద ఎంపీల నుంచి పెద్దగా రియాక్షన్ ఉండకపోవడం టాపిక్ అవుతోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి.. తప్ప మిగతా ఆరుగురు ఎప్పుడూ నోరు తెరిచిన పాపాన పోలేదని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సందర్భం ఏదైనా సరే… వాళ్ళిద్దరి నుంచి రియాక్షన్ వస్తుంది, ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌కి చెందిన ఓ ఎంపీ అయితే… అసలు ఇప్పటి వరకు గాంధీ భవన్ మెట్లే ఎక్కలేదు. ప్రభుత్వానికి, సీఎంకు మద్దతుగా నిలవడం సంగతి దేవుడెరుగు అస్సలు పార్టీ తరపున కూడా మాట్లాడ్డం లేదు. ఇక నల్గొండ Mp రఘువీర్‌రెడ్డి అయితే… ఇప్పటి వరకు సీఎం రేవంత్‌తో తప్ప బయట ఎప్పుడూ కనిపించడం లేదు.
సరే.. ఇక్కడ ఇలా ఉన్నారు. పోనీ… ఢిల్లీలో అయినా వెలగబెడుతున్నారా అంటే.. అదీలేదు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటిదాకా పార్లమెంట్లో కూడా పెద్దగా సమస్యలు ప్రస్తావించిన దాఖలాలు లేవు. కొత్తగా ఎన్నికైన వాళ్లే కాదు… సీనియర్ నాయకులు కూడా సీఎం దగ్గర తప్ప మిగతా ఇష్యూల్లో పెద్దగా కనిపించడం లేదు. పేరుకు చెప్పుకోవడానికి ఎనిమిది మంది ఎంపీలున్నారు కానీ… పార్టీకి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నది మాత్రం ఇద్దరు ముగ్గురేనన్నది గాంధీభవన్ టాక్. మిగిలిన వాళ్లంతా అయితే మాకేంటి అనుకుంటున్నారో… లేక మనకెందుకులే అని ఉదాసీనంగా వదిలేస్తున్నారోగానీ… ఆ వైఖరి మారకుంటే అంతిమంగా వాళ్ళకే నష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్‌లో. పార్టీ నాయకత్వం అందర్నీ గమనిస్తోందన్న సంగతి మర్చిపోతే ఎలాగన్నది వాళ్ళకు అందుతున్న సున్నితమైన హెచ్చరిక.