ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకి రాసిన లేఖలో మదన్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు.
‘పదేళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేశా. లిక్కర్ స్కామ్ కేసులో నేను చెప్పినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారు. నా కంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లే విన్నాడని అధికారులు చెప్పారు. విచారణకు యూనిఫామ్‌లో వెళ్లనందుకు నన్ను తిట్టారు. చెవిరెడ్డికి లిక్కర్ కేసులో సంబంధం ఉందని నన్ను చెప్పామన్నారు. తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనందుకు నాపై సిట్ అధికారులు దాడులు చేశారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరుకాలేను’ అని ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి పేర్కొన్నారు.
ఏపీ హైకోర్టులో తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు బలవంతంగా వాంగ్మూలాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్ వేశారు. సిట్ అధికారులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, విచారణ పారదర్శకంగా జరిగేలా ఆదేశించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇక సిట్ అధికారుల దాడుల వల్ల మదన్ ఆరు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు.