Atchannaidu Letter to APSRTC: మార్చి 17వ తేదీన చిలకలూరిపేట వేదికగా ఉమ్మడిగా టీడీపీ – జనసేన మరో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.. అయితే, చిలకలూరిపేట సభకు బస్సులు అద్దెకు ఇవ్వాలంటూ ఏపీఎస్‌ఆర్టీసీకి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున మార్చి 17వ తేదీన చిలకలూరిపేటలో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నాం.. ఉభయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ప్రజలు సమావేశానికి హాజరై తిరిగి వారి గృహాలకు వెళ్లేందుకు రవాణ సౌకర్యం అత్యవసరం అని లేఖలో పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.
Read Also: Sudha Murthy: ఉమెన్స్ డే రోజున సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
అయితే, గతంలో తెలుగుదేశం పార్టీ సమావేశాలకు బస్సులు అద్దెకివ్వాలని ఎన్నో సార్లు కోరినా ఇవ్వలేదు అని లేఖ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లారు అచ్చెన్నాయుడు.. అధికార పార్టీ సమావేశాలకు మాత్రం ఆర్టీసీ బస్సులు పంపుతూ వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీకి మాత్రం అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వమ్యంలో తగదన్న ఆయన.. ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పించే నిమిత్తం అద్దె బస్సులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మరోసారి కోరుతోందన్నారు. కావున ఏపీఎస్ ఆర్టీసీ వారు చిలకలూరిపేట సభకు అద్దె బస్సులు ఇవ్వాలని పార్టీ తరపున కోరుతున్నాం అని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. కాగా, ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న టీడీపీ-జనసేన బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుంటే ప్రస్తుతం ఉన్న అధికారులు ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ఇంతకుముందే ఆర్టీసీ అధికారులను అచ్చెన్నాయుడు హెచ్చరించిన విషయం విదితమే.