విశాఖపట్నం తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం (జనవరి 4) జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా.. అధికారులు గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో.. గాలి అనుకూలించకపోవడంతో రెండు ప్యారాచూట్ల ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో పట్టుకోల్పోయిన ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు.
అప్పటికే విశాఖ సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది.. ఇద్దరు నావికులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నావికులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ సముద్రంలో దాదాపు 12 నౌకల పైనుంచి నిర్వహించిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. లేజర్ షో అనంతరం డ్రోన్ షో చేపట్టారు. దేశ చిత్రపటం, సబ్‌మెరైన్, ఫైటర్ జెట్, నౌక, యుద్ధ ట్యాంకులు, సైనికుడు, కళింగ చక్రవర్తి, మేకిన్ ఇండియా ఆకృతులను డ్రోన్ షోలో ప్రదర్శించారు.