తిరుమల లడ్డు అంశం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో కూటమి నేతలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు రేపు కీలక సమావేశం జరగనుంది. మూడు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ పాల్గొనే ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లి సీఎం నివాసంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ సమావేశం కానున్నారు. తిరుమల లడ్డు అంశంపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఏ విధమైన ప్రచారం చేపట్టాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు, పవన్ మధ్య ప్రాథమికంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరుమల లడ్డు అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడం ద్వారా తమ వాదనను బలంగా వినిపించాలని కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రోడ్‌మ్యాప్, ప్రచార వ్యూహాలు, ప్రజా సమావేశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read: YS Jagan: వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తాం.. జగన్ మాస్ వార్నింగ్!
ఇదే భేటీలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ప్రచారం ఎలా ఉండాలి, ఏ అంశాలపై ఫోకస్ పెట్టాలి అనే విషయాలపై కూడా నేతలు చర్చించనున్నారు. మొత్తానికి తిరుమల లడ్డు అంశం, ఏపీ–తెలంగాణ రాజకీయ పరిణామాలు కలిసి రేపటి సమావేశాన్ని మరింత కీలకంగా మార్చాయి. ఈ భేటీ తర్వాత రాజకీయంగా మరిన్ని సంచలన నిర్ణయాలు వెలువడే అవకాశముంది.
