Minister Narayana: రాజధాని అమరావతిని ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిర్మించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారు. దీనికి తగ్గట్లుగా గతంలోనే మాస్టర్ ప్లాన్‌లు రూపొందించారు. 2019లో మరోసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతికి ప్రత్యేక గుర్తింపు వచ్చేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించింది. తాజాగా రాజధాని నిర్మాణంలో 2019కు ముందు ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి నిర్మాణంలో భాగంగా దేశ విదేశాల్లో అభివృద్ధి చెందిన ఆధునిక నగరాల నిర్మాణాల్లో అనుసరించిన విధానాలను గతంలో అధ్యయనం చేసింది ఏపీ ప్రభుత్వం.
Read Also: Minister TG Bharath: ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్..100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం
తాజాగా పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది. మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు నవీన్, సూర్య సాయి ప్రవీణ్ చంద్‌లు ఈ పర్యటనకు వెళ్లారు. సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది. నవీ ముంబై నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఉన్న సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(CIDCO) ముఖ్య భూమిక పోషిస్తుంది. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో సిడ్కో పాత్ర చాలా కీలకమైనది..మంత్రి నారాయణ బృందం నవీ ముంబైలో రోడ్ నెట్ వర్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై అధ్యయనం చేసింది. నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రభావిత నోటిఫైడ్ ఏరియాలో పర్యటించింది మంత్రి బృందం. ఆ తర్వాత సిడ్కో అధికారులతో మంత్రి బృందం సమావేశమైంది. అక్కడి హౌసింగ్ స్కీమ్స్, ఆర్థిక ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలు గురించి సిడ్కో అధికారులు వివరించారు. నవీ ముంబై అభివృద్ధిపై సిడ్కో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.