AP Ministers: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ మంత్రులు ప్రసంగించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏదైనా గ్రాఫిక్సేనని.. ఇది చారిత్రాత్మకమైన ఘట్టం అంటూ మంత్రి వెల్లడించారు. జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటే వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకుని మన దగ్గరకు వస్తారని ప్రశ్నించారు. పేదరికాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు.
Read Also: Andhrapradesh: అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు
భారతదేశం గర్వించదగ్గ ఘట్టం: డిప్యూటీ సీఎం
విజయవాడ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఇది భారతదేశం గర్వించదగ్గ ఘట్టమని.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఇవాళ అందరం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నామన్నారు. ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను సీఎం జగన్ నడిపిస్తున్నారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు దళితులను అవమానించాడని.. ఎవరైనా దళితుడిగా పుట్టాలి అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఆ దళితుడినే ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి జగన్ అంటూ ఆయన కొనియాడారు. ఇటువంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఎవరు, ఎన్ని కుట్రలు పన్నినా మనం అందరం గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలన్నారు.
జగన్ రుణం తీర్చుకోలేం: ఆదిమూలపు సురేష్
125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏమిచ్చినా జగన్ రుణం తీర్చుకోలేమని ఆయన తెలిపారు. కుహనా మేధావులకు చెంప పెట్టు అంబేడ్కర్ విగ్రహమని చెప్పారు. మనల్ని తలెత్తుకునేలా చేసిన జగన్ కు అందరం అండగా నిలబడదామని ప్రజలకు మంత్రి సూచించారు.
ఇదొక చారిత్రాత్మక సందర్భం: మేరుగ నాగార్జున
ఇదొక చారిత్రాత్మక సందర్భమని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో తాము ఆంధ్రప్రదేశ్‌లో అవమానాలకు గురయ్యామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహాన్ని పెడతానని చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుండెలపై చేతులు వేసుకుని హాయిగా ఉండే పరిస్థితులు వచ్చాయన్నారు. దేశంలోని దళితులు అందరు గర్వపడుతున్నారన్నారు. కొండ మీద అమ్మవారు ఉంటే.. కొండ కింద అంబేడ్కర్ వారిని పెట్టారన్నారు. అంబేడ్కర్ వాదులను గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి జగన్ అంటూ మంత్రి తెలిపారు. అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత జగన్‌కు లేదని కొందరు అంటున్నారని.. అంబేద్కరిజాన్ని మోస్తున్న ఏకైక నాయకుడు జగన్ అంటూ ఆయన స్పష్టం చేశారు.
తానేటి వనిత
రోల్ ఆఫ్ సోషల్ జస్టిస్ … జగన్: తానేటి వనిత
ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేసిన మహానుభావుడు అంబేడ్కర్ అంటూ హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. అటువంటి మహా వ్యక్తి విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారన్నారు. సోలో ఆఫ్ సోషల్ జస్టిస్, రోల్ ఆఫ్ సోషల్ జస్టిస్ … జగన్ అంటూ ఆమె కొనియాడారు.