Andhrapradesh: ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నకిలీ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆలస్యంగా చర్యలు చేపట్టింది. అప్పట్లో తిరుపతి ఆర్వోగా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా ఐఏఎస్‌పై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈసీఐ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాని సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్నటి తేదీతో సీఎస్ జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ విజయవాడ వదిలి వెళ్లొద్దని గిరీషాకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహరంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అప్పటి ఆర్వోగా వ్యవహరించిన గిరీషా తన లాగిన్‌ను దుర్వినియోగ పరిచారని అభియోగం నమోదైంది. మరో ఐఏఎస్, ఐపీఎస్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: YSRCP: ఐదో జాబితాపై వైసీపీలో ఉత్కంఠ!.. సీఎం క్యాంపు ఆఫీస్‌కు క్యూ కట్టిన నేతలు
గిరీషా లాగిన్ నుంచి 30 వేలకు పైగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించినట్లు గుర్తించిన ఎన్నికల కమిషన్ గుర్తించింది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న గిరీషా తన లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లను సిబ్బందికి ఇచ్చేయడంతో ఈ అక్రమాలు జరిగాయని ఈసీ గుర్తించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓ పక్షానికి కొమ్ముగాయకుండా నిష్పాక్షపతంగా వ్యవహరించాలన్న ఈసీ ఆదేశాలను ఉల్లంఘించిన ఐఏఎస్‌పై వేటు పడింది. తొలి వికెట్‌గా అన్న మయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై వేటు పడింది. తిరుపతి మున్సిపల్ కమిషషనర్‌గా ఉన్న సమయంలో తన లాగిన్, పాస్ వర్డ్‌లను వైసీపీకి చెందిన వ్యక్తులకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి.