AP Minister RK Roja Slams Chandrababu Naidu and Pawan Kalyan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. జగన్‌ను ఓడించాలంటే.. అవతలి వైపు కూడా జగనే ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు.. జగన్‌ను ఎలా ఓడిస్తాడు అని మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రజలందరూ 2024 జగనన్న వన్స్‌మోర్ అంటున్నారని, ఆంధ్ర రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ మేరకు నగరి సీఎం సభలో మంత్రి రోజా అన్నారు.
నేడు సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేశారు. బటన్ నొక్కి రూ. 680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్బంగా వేదికపై మంత్రి రోజా మాట్లాడుతూ టీడీపీ, జనసేనపై సెటైర్లు వేశారు.
‘దేశంలో ఎక్కడా లేని పథకం విద్యా దీవెన. నాణ్యమైన విద్యను పేదవాడి ఆస్తిగా మార్చిన ఘనత సీఎం జగన్‌దే. చదువుకు కుల, మత, ప్రాంత బేధాలు చూడకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారు. విద్యారంగంలో దేశానికే ఏపీ అదర్శంగా నిలుస్తోంది. సీఎం జగన్ వల్లే అన్ని వర్గాలకు విద్య చేరువైంది. ఆటో డ్రైవర్ కూతురు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేస్తోంది. రైతు బిడ్డ వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు. మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. కంపౌండర్ కూతురు డాక్టర్ చదువుతున్నాడంటే అది సీఎం జగన్ వల్లే. కొర్పోరేట్ స్కూళ్లకు ప్రభుత్వ స్కూళ్లు పోటీనిస్తున్నాయి. విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో ఏ సీఎం కూడా తీసుకురాలేదు’ అని మంత్రి రోజా ప్రశంసించారు.
Also Read: Neeraj Chopra: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను తలపించిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్!
‘సీఎం వైఎస్ జగన్ నొక్కే బటన్ విపక్షాలకు భవిష్యత్ లేకుండా చేస్తుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు కూడా విద్యా దీవెన పథకం వర్తింప చేయాలని సీఎంను కోరుతున్నా. దీంతో వారికి మంచి చదువు చెప్పించాలి. టీడీపీని నమ్ముకుంటే జైలుకు, పవన్‌ను నమ్ముకుంటే సినిమాలకు వెళతారు. అదే జగన్‌ను నమ్ముకుంటే మంచి కాలేజీలకు వెళ్లి బాగా సెటిల్ అవుతారు. జగన్‌ను ఒడించి, ఆడించాలనుకునే వారు ఇంకా పుట్టలేదు. 2024.. జగన్ వన్స్ మోర్ అని జనాలు అంటున్నారు. రియల్ హీరో జగన్ ఉండగా.. ఇక రీల్ హీరో అవసరం లేదు’ అని మంత్రి రోజా అన్నారు.