టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై (Gorantla butchaiah chaudhary) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chelluboina venugopal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందే బుచ్చయ్య చౌదరి ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు. రెండు పర్యాయాయాలు ఎమ్మెల్యేగా పని చేసినా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం శూన్యమని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచాక అమెరికాకు వెళ్లిపోవడం.. ఆ తర్వాత కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో గోరంట్ల ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని మంత్రి చెప్పుకొచ్చారు.
టిక్కెట్ కోసం అధిష్టానాన్ని మెప్పించడానికి అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. అధికారమంటే మీకు లాగా అహంకారం కోసం కాదు? సేవ కోసమే అన్నారు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలు జమ చేశామని.. ఇసుక దోపిడీకి పాల్పడింది టీడీపీ పార్టీనేనని ధ్వజమెత్తారు. నేషనల్ ట్రిబ్యునల్ అధారిటీ ఇసుక దోపిడీపై జరిమానా వేసింది తెలుగుదేశం హాయంలోనేనని తెలిపారు. తనపై ఇసుక దోపిడీ ఆరోపణ చేయటం విడ్డూరంగా ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని.. ప్రతిపక్ష పార్టీలకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం తెలుసు అని మంత్రి నిలదీశారు.