AP Inter Results: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను మంత్రి విడుదల చేశారు.ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 8,13,033 మంది విద్యార్థులు హాజరయ్యారని మంత్రి తెలిపారు. ప్రథమ సంవత్సరం నుంచి 4,33,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ద్వితీయ సంవత్సరం నుంచి 3,79,750 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. 1,489 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫస్టియర్‌లో 2, 66, 326 మంది.. సెకండ్ ఇయర్‌లో 2,72,001 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఫస్టియర్ ఉత్తీర్ణత 61 శాతం ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. పూర్తి పారదర్శకంగా పరీక్షల నిర్వహణ, స్పాట్ వ్యాల్యుయేషన్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షలు జరిగిన 22 రోజుల్లోనే ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది.
ఫలితాల కోసం: క్లిక్ చేయండి
మొదటి సంవత్సరం బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 58 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలా రెండో సంవత్సరం బాలికలు 75 శాతం.. బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని మంత్రి చెప్పారు. ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి. విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్ బోర్డు కమిషనర్ ఎంవి శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్, జగనన్న గోరుముద్ద డైరెక్టర్ నిధి పాల్గొన్నారు.
Read Also: AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలలో ఆలస్యం.. కారణమేంటంటే?
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5 గంటలకే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ జాప్యం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనగా.. సీఎం హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా మంత్రి విజయవాడ చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో సాయంత్రం 5గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం జరిగింది.