ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే, ఏబీని రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఉత్తర్వుల్ని ఉన్నత న్యాయస్థానం సమర్దించింది. రెండోసారి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం చెల్లదని తీర్పు వెల్లడించింది. దీంతో రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందు ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది.
Read Also: Warangal: వరంగల్ సంరక్ష హాస్పిటల్ ముందు ఉద్రిక్తత..
కాగా, గతంలో ఏబీపై విధించిన సస్పెన్షన్ ఎత్తేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో తనకు పెండింగ్ ఉన్న జీత భత్యాలు, పోస్టింగ్ కోసం ఏబీ ఎదురు చూస్తున్న టైంలోనే ఆయనపై రెండోసారి ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. దీన్ని క్యాట్ తోసిపుచ్చింది. ఇప్పుడు క్యాట్ ఉత్తర్వుల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో రేపు ( జూన్ 1) రిటైర్ అవుతున్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట దొరికింది. సస్పెన్షన్ ఎత్తివేత నేపథ్యంలో ఆయనకు యథావిధిగా రిటైర్మెంట్ ప్రయోజనాలు దొరకనున్నాయి. కాగా, ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా ఏబీకి బాధ్యతలు అప్పగించింది. ఇవాళ సాయంత్రమే ఏబీ వెంకటేశ్వరరావు రిటైరవుతున్నారు.