TB BCG Vaccines in AP: పెద్దలకు టీబీ బీసీజి టీకాలు వేయడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ టీకాలు వేసినప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్యను కూడా ఏఎన్ఎంలు క్రియేట్ చేయాలన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జాతీయ టీబీ నిర్మూలనా కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 17.78 లక్షల మందికి టీబీ బీసీజీ టీకాలు వేశారని, 50 లక్షల మందికి టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు. టీబీ పేషెంట్లకు అదనపు పోషాకాహారాన్ని పంపిణీ చేసేందుకు గాను పలు పారిశ్రామిక వేత్తల్ని సంప్రదించాలని, జిల్లాల్లో ఆయా జిల్లా పరిశ్రమల అధికారుల సహాయాన్ని తీసుకోవడం ద్వారా మరింత విస్తృతంగా దీన్ని అమలు చేయాలన్నారు. సబ్ సెంటర్లలో కూడా టీబీ శాంపిళ్లను సేకరించాలన్నారు.
Read Also: AP CM Chandrababu: మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఇసుక లభ్యత, ధరలపై కీలక చర్చ
టీబీ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఉన్న ల్యాబ్‌లతో పాటు ఇంకా అవసరమైన ల్యాబ్‌ల విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో టీబీ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక దశలోనే టీబీని గుర్తించడం ద్వారా మరింత సమర్ధవంతంగా నిర్మూలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీబీ రోగులకు సరిపడా మందుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడా మందుల కొరత రాకూడదన్నారు. దేశ వ్యాప్తంగా 35 నుండి 40 శాతం వరకు టీబీ బారిన పడుతున్నారన్నారు. 2025 నాటికి టీబీ రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా కృషి చేయాలన్నారు. టీబీ విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలన్నారు. గతేడాది 84 వేల టీబీ కేసుల్ని గుర్తించగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 43 కేసుల్ని గుర్తించామని రాష్ట్ర టీబీ అధికారి జేడీ డాక్టర్ టి.రమేష్ వివరించారు. 94 శాతం మంది టీబీ రోగులకు విజయంతంగా చికిత్స అందించి స్వస్థత చేకూర్చామన్నారు. స్టేట్ కన్సల్టెంట్లు, ఐటీ నిపుణులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.