AP CM Chandrababu: ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై చర్చించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు. గత ఐదేళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్ష చేపట్టారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ. 1025 కోట్లు చెల్లించలేదని అధికారులు తేల్చారు.
Read Also: Minister Narayana: నవీ ముంబైలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన
దీనిపై కేసులు నమోదు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల తలెత్తిన సమస్యలపై సీఎం సమీక్షలో ప్రస్తావించారు. ఉచిత ఇసుక పాలసీ అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపై చర్చలు జరిపారు. రవాణా ఖర్చుల కారణంగా కొన్ని చోట్ల అనుకున్నంత తక్కవ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైనా చర్చించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా.. కొత్తగా ఏఏ విధానాలు అవలంభించవచ్చనే అంశంపై అధికారులతో సమీక్షించారు. రీచ్ నుంచి నేరుగా అవసరం ఉన్నవారికి ఇసుక తీసుకువెళ్లగలిగితే భారం ఉండదని సీఎం పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని.. వినియోగదారులకు భారం కాకుండా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.