విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రభుత్వం 17,805 కోట్లు వ్యయం చేసిందని తెలిపారు. 15వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా అందిస్తోందన్నారు. ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. కుల, మత రాజకీయ వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నామని ఏపీ గవర్నర్ చెప్పారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 20 కీలక అంశాల్లో ప్రభుత్వ విజయాలను గవర్నర్ వివరించారు.
’15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా అందిస్తోంది. వీటి ద్వారా 540 పౌర సేవలు ప్రజల ఇంటి దగ్గరే అందిస్తున్నాం. ఈ సేవలకు 1.35 లక్షల శాశ్వత సచివాలయం ఉద్యోగులు, 2.66 లక్షల వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లీనిక్స్ ద్వారా ప్రజలకు గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నాం. రైతుల కోసం 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్కూళ్లల్లో నాడు -నేడు ద్వారా విప్లవాత్మక మార్పులు చేశాం. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రభుత్వం 17,805 కోట్లు వ్యయం చేసింది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పటానికి గర్వపడుతున్నాను’ అని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
Also Read: Virat Kohli Fan: ఉప్పల్ టెస్ట్.. రోహిత్ శర్మ పాదాలు తాకిన విరాట్ కోహ్లీ అభిమాని!
‘గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళుతోంది. మొదటి దశ జగనన్న ఆరోగ్య సురక్షా పూర్తి చేశాం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని అద్దం పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పాలనలో సంస్కరణలు తీసుకుని వచ్చాం. 26 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, 16 పోలీసు డివిజన్లు ఏర్పాటు చేశాం. ప్రజల వద్దకు పాలన తీసుకుని వచ్చాం. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చింది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పలు పథకాలు అమలు చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియంలో విద్య, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్, డిజిటల్ విద్య ద్వారా ప్రభుత్వ విద్యార్థులను విశ్వ పౌరులుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 లక్షల 13 వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది’ అని ఏపీ గవర్నర్ చెప్పారు.