Sajjala Ramakrishna Reddy: ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ వేసింది ఏపీ హైకోర్టు పడింది.. హైకోర్టు తీర్పుతో ఆర్ 5 జోన్ జగనన్న లేఅవుట్స్ లో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.. అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై ఈ రోజు వైఎస్ జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. అక్కడ యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.. అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, దీనిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. హైకోర్టు తీర్పుపై కచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారు.
ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు బ్రేక్ వేయడంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. బయట వాళ్లకు ఇక్కడ (అమరావతి) ఎందుకు ఇళ్లు ఇస్తున్నారని అడుగుతున్నారు.. కాలేజీలకు, ప్రైవేటు సంస్థలకు అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చారు.. మరి వాళ్లు బయటి వాళ్లు కాదా? అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు పై కచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేసిన ఆయన.. అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగమే.. సజీవమైన నగరం అభివృద్ధి అయ్యేటట్లు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.. ఆర్ 5 జోన్‌లో భూములు ఇచ్చింది ఎవరికో ఆలోచించండి.. పేదలు, దళితులకు కాదా? అని ప్రశ్నించారు. పేదలను కాదని ఒక రాజకీయ పార్టీ ఎలా మనగలుగుతుందో అర్ధం కావటం లేదని.. కోర్టు తీర్పుపై సంబరాలు చేసుకునే వాళ్ల కంటే విచిత్రం ఉంటుందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల.
ఇక, చంద్రబాబు హయాంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు కట్టలు కట్టలు చెత్త కుప్పల్లో కనిపించేవి.. ఒకరు చనిపోతే కానీ మరొకరికి వృద్ధాప్య పింఛను ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు.. కానీ, జగన్ ప్రభుత్వంలో దీనికి పూర్తి విరుద్ధమైన వాతావరణం ఉందని.. శాచ్యురేషన్ విధానంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తోందని తెలిపారు సజ్జల.. నెల 1వ తేదీనే 80 శాతం పింఛన్లు వృద్ధుల చేతిలో పడుతున్నాయి.. క్యాలెండర్ పెట్టుకుని పథకాలను అందిస్తున్నాం.. పథకాలు అందని అర్హులను గుర్తించి మరీ పథకాలు అందించటానికే జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించామని.. సర్టిఫికెట్ల సమస్యలను కూడా ప్రజల వద్దకు వెళ్లి మరీ ప్రభుత్వ సేవలను అందిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏడాదికి రెండు సార్లు చేపట్టాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు.. ఇలా చేయటం వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరుగుతుందన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకా కుమార్తె సునీతను పులివెందుల పులి అనటం ద్వారా ఆమె మాటలు, చేతల వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తుందని విమర్శించారు. ముసుగులు తొలుగుతున్నాయి.. సునీతకు, ఆమె భర్తకు రాజకీయ ఆకాంక్షలు ఉండటంలో తప్పు తేదు.. టీడీపీ నుంచో, మరో పార్టీ నుంచో పోటీ చేస్తే ప్రజలే ఎవరి వైపు ఉన్నారో తెలిసిపోతుందన్నారు. జగన్ పై పోటీ చేస్తానని గతంలోనే సునీత భర్త చెప్పిన విషయం వాస్తవమే కదా? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి.