Nandamuri Ramakrishna Visits Kanaka Durga Temple: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్న నేపథ్యంలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుమారుడు నందమూరి రామకృష్ణ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని ఆయన అమ్మవారిని ఆకాంక్షించారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు అంతా మంచి జరగనుందని రామకృష్ణ పేర్కొన్నారు.
‘ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయి. ఇకపై ప్రజలకు అంతా మంచి జరగనుంది. ఐదేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి ఈ రోజుతో ముగింపు కలగబోతోంది. అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్రంపై, ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నా. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు అవస్థలు, తిప్పలు, పన్నుల మోతలు తప్ప మరేమీ లేవు. యువతకు ఉద్యోగాల్లేవు. రైతులకు గిట్టుబాటు ధరల్లేవు. అభివృద్ధి అనేదే రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని మెరుగైన మార్గంలో నడిపించేలా ఎన్డీఏ కూటమికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి’ అని నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు.
Also Read: AP Elections Results 2024: మంగళగిరి ఫలితంపై ఉత్కంఠ.. నారా లోకేశ్ విజయం సాధించేనా?
విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను నందమూరి రామకృష్ణ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వీరమాచనేని శివప్రసాద్, వల్లూరు కిరణ్, సాయి జ్యోతి, పేరేపి ఈశ్వర్, పఠాన్ హయ్యత్ ఖాన్, కాలేషా వలి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో అత్యధిక సర్వే సంస్థలు కూటమి విజయం సాదిస్తుందని వెల్లడించాయి. మరికొన్ని సర్వేలు వైసీపీ రేనోసారో అధికారం చేపడుతుందని పేర్కొన్నాయి.