నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం ఆరంభం కాబోతోంది. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్‌ఎస్) ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్‌కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు. మంత్రి పయ్యావుల కేశవ్, సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితర ప్రముఖులు తొలిరోజు ఎక్జిబిషన్‌కు హాజరుకానున్నారు.
జనవరి 2 నుంచి 12 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విజయవాడ బుక్ ఎక్జిబిషన్ కొనసాగుతుందని వీబీఎఫ్‌ఎస్ కార్యదర్శి మనోహర్ నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పిడికిటి రామకోటేశ్వరరావు, ప్రధాన సాహిత్య వేదికకు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు, విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహించే ప్రతిభా వేదికకు రతన్‌టాటా పేర్లు పెట్టినట్లు వీబీఎఫ్‌ఎస్ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య పేరొన్నారు. ఈ ఏడాది 294 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈసారి ఎక్కువగా ఇంగ్లీషు బుక్ పబ్లిషర్లు రానున్నారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. విజయవాడలో మూడున్నర దశాబ్దాలుగా ప్రతి ఏడాది పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.