Jagananna Thodu: జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నిధుల జమకు శ్రీకారం చుట్టారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. లక్షల మంది చిరువ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం. ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం 8వ విడత జరుగుతోంది. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ల బతుకులు ఎలా ఉంటాయనేది మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నా వాళ్ల బతుకులు ఎలా మార్చాలి, వీళ్లకు డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్లు పడుతున్న కష్టాలేమిటి అని బహుశా ఎప్పుడూ ఎవరూ ఇంత ఆలోచన చేయలేదు. నా కళ్ల ఎదుట కనిపించినప్పుడు, దాదాపు నా పాదయాత్రవల్ల జరిగిన పరిస్థితులుగానీ, ప్రతి జిల్లాలోనూ ఇది కనిపించేది అన్నారు.
అప్పు కావాలి అంటే, వ్యాపారాలు చేసుకోవాలంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం కూరగాయలు, పనిముట్లు తెచ్చుకోవాలంటే రూ.1000 ఇచ్చే సరికి రూ.100 కట్ చేసుకొని సాయంత్రానికి మళ్లీ తిరిగి 1000 అసలు తీసుకొనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్.. 10 రూపాయల వడ్డీ వీళ్లు కట్టి ఆ డబ్బులు తీసుకుంటే తప్ప.. వీళ్ల బతుకులు ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా కనిపిస్తున్నా ఎవరూ సొల్యూషన్ చూపించాలని అడుగులు పడలేదు. కానీ, మన ప్రభుత్వం గర్వంగా చెప్పే అంశం.. మన ప్రభుత్వం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడిందన్నారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి గురించి బ్యాంకర్లతో మాట్లాడి ఇన్వాల్వ్ చేయించడం, కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోవడం, రూ.10 వేలు ప్రతి ఒక్కరికీ ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఇచ్చేట్టుగా చేశాం. ఆ మొత్తం వడ్డీ భారాన్ని సకాలంలో కట్టేట్టుగా మోటివేట్ చేస్తూ, అలా కడితే మొత్తం వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భరోసా కల్పించాం. ఇవన్నీ చేస్తూ 8వ దఫా కింద ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. 86,084 మందికి రూ.86 కోట్లు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తున్నాం. గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3.09 లక్షల మందికి రూ.332 కోట్ల రుణాలను రెన్యువల్ కూడా చేస్తున్నాం.. మొత్తంగా రూ.418 కోట్లు 3.95 లక్షల మందికి కొత్త రుణాలుగా ఇస్తున్నాం అని వెల్లడించారు.
గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వడ్డీని రూ.13.64 కోట్లను వడ్డీని తిరిగి మళ్లీ వాళ్లకు ఇస్తున్నాం అన్నారు సీఎం జగన్.. రూ.430 కోట్లు మొత్తంగా ఈరోజు లబ్ధి చేకూరుస్తూ వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతోంది. 8వ విడత కూడా తీసుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాల కింద ఇచ్చాం. వాళ్ల తరఫున వాళ్లు కట్టిన వడ్డీ రూ.88.33 కోట్లు వడ్డీ తిరిగి వెనక్కు ఇచ్చాం అన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 73,072 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు కట్టి, తీసుకున్నారు. 5,10,241 మంది లబ్ధిదారులు 3 సార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 3,98,229 మంది చిరువ్యాపారులు 2 సార్లు రుణాలు పొంది కట్టి, మళ్లీ తీసుకున్నారని వివరించారు.
మొదటి సంవత్సరంలో రూ.10 వేలు ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఇవ్వడం, సకాలంలో చెల్లించిన వారందరికీ ఏటా మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరఫున వడ్డీని వెనక్కి ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు సీఎం జగన్. ప్రతి సంవత్సరం రూ.1000 పెంచుతూ రూ.13,000 దాకా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ ను అమలు చేయడం సంతోషాన్ని కలిగించే అంశం. 16.73 లక్షల మందిలో 87.13 శాతం నా అక్కచెల్లెమ్మలే. నిజంగా ఇది మహిళా సాధికారత విషయంలో మరో విప్లవం అని కూడా చెప్పొచ్చు. మరో సంతోషాన్ని కలిగించే విషయం.. 16.73 లక్షల మందిలో 79.14 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ ఈ వర్గాల వారే ఉన్నారు. సాధికారత విషయంలో ఇది మరో విప్లవం అని చెప్పొచ్చు. రాష్ట్రంలోనే గొప్ప విప్లవాత్మక అడుగులు పడుతున్నాయి. దేశానికే మనం చేసే ఈ కార్యక్రమం దిక్సూచిగా ఉందన్నారు. దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహించి 7 శాతం వడ్డీకి ఇలాంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పిస్తోంది. కేంద్రం దేశ వ్యాప్తంగా 58.65 లక్షల మందికి పీఎం స్వనిధి పేరుతో ఇస్తే, ఒక్క మన రాష్ట్రంలోనే 16.74 వేల మంది ఒక్క మన రాష్ట్రంలో మన నంబర్స్ ఉన్నాయి. రూ.10,220 కోట్లు ఇలా కేంద్రం 7 శాతం వడ్డీకి ఇచ్చే కార్యక్రమం చేస్తే, ఒక్కమన రాష్ట్రంలో రూ.3,373 కోట్లు ఇవ్వగలిగాం. వడ్డీ మొత్తం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి 7 శాతం వరకే రూ.138 కోట్లు వడ్డీలకు కడితే, మన ఒక్క రాష్ట్రమే రూ.88 కోట్లు కట్టగలిగాం అన్నారు.
మన దగ్గరున్న గొప్ప వ్యవస్థ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అని అభివర్ణించారు సీఎం జగన్.. ఈ వ్యవస్థల ద్వారా మనం రుణాలు అదే మాదిరిగా ట్రాన్స్ పరెంట్ పద్ధతిలో ఇప్పించగలుగుతున్నాం. రుణాలు కట్టే విధంగా కూడా వాళ్లను మోటివేట్ చేసేలా పని చేస్తున్నాయి. రుణాల రికవరీ దాదాపు 95 శాతం పైచిలుకుగానే ఉందని చెప్పడానికి సంతోషకరమైన వార్త అన్నారు. మనం రాకముందు పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి దాదాపు 18 శాతం ఎన్‌పీఏలుగా ఉండేవి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 0.3 శాతం లోపే. ప్రతి అడుగులోనూ పారదర్శకత ఏరకంగా చేయగలుగుతున్నాం. జీవనోపాధి కల్పించేలా అడుగులు వేయడం, వ్యాపార అవకాశాలు కల్పించడం, పెద్ద పెద్ద కంపెనీలతో టై అప్ చేయడం, బ్యాంకులతో టై అప్ చేయడం జరిగింది. చేయి పట్టుకొని నడిపిస్తూ మహిళా సాధికారత కోసం అడుగులు వేయగలుగుతున్నాం. వీళ్లందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని వెల్లడించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.