తనకు సీఎం పదవి జాక్‌పాట్ కాదని, దానికి వెనుక ఎంతో కష్టం ఉందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరైనా సరే కష్టపడితే జీవితంలో పైకి వస్తారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటికీ నుండి కుప్పంలో పసుపు జెండానే ఎగిరిందని, కుప్పం ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈ స్వర్ణ కుప్పం విజన్ తీసుకొచ్చానన్నారు. 2014-19 మధ్య ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైసీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందని సీఎం మండిపడ్డారు. 2027 నాటికి ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ తొలి రెండు స్దానాల్లో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘గత ఐదు ఏళ్లుగా వైసీపీ విధ్వంస పాలన సాగించింది. రాష్ట ఆర్ధిక పరిస్థితిని నాశనం చేశారు. వైసీపీ పార్టీ నాయకులు ప్రజలను భయపెట్టి అనిచివేశారు. పేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 1995లో విజన్ 20-20 రూపొందించాను. అప్పట్లో రకరకాల మాటలు అన్నారు కాని నేను చెప్పిందే నిజమైంది. ద్రావిడ వర్శిటి ఎర్పాటు చేసినా ఘనత ఎన్టీఆర్ గారిది. విశ్వవిద్యాలయాలను సైతం వైసీపీ తన రాజకీయలకు వాడుకుంది’ అని ఫైర్ అయ్యారు.
‘2027 నాటికి ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ మొదటి రెండు స్దానాల్లో ఉంటుంది. ఇంగ్లీషు మన జీవితంలో ఒక భాగం అయిపొయింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాము. గత 25 సంవత్సరాలలో హైదరాబాద్ ఒక మహానగరంగా మారింది. తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆనాడు నేను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రం అప్పుల ఊబిలో పడింది. కుప్పానికి రాబోయే ఐదేళ్లులో ఏమి చేస్తానో ముందుగానే ఒక విజన్ ప్రకటిస్తున్నా. కష్టపడితే జీవితంలో పైకి వస్తారు. నాకు సీఎం పదవి జాక్‌పాట్ కాదు.. దానికి వెనుక ఎంతో కష్టం ఉంది. పార్టీ పెట్టినప్పటికీ నుండి ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. కుప్పం ప్రజలు వరుగా నన్ను గెలిపించారు. వారి రుణం తీర్చుకోవడానికి ఈ స్వర్ణ కుప్పం విజన్’ అని సీఎం చెప్పుకొచ్చారు.