CM Chandrababu: నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జరిపిన టెలీ కాన్ఫరెన్సులో చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేసినట్లు టెలీ కాన్ఫరెన్సులో చంద్రబాబు పేర్కొన్నారు. ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తీర్చుకుంటామన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందన్నారు. ఎవరు ఏ మేరకు పని చేశారోననే సమాచారం పార్టీ దగ్గర ఉందన్నారు.
Read Also: Air India: గన్నవరం నుంచి ముంబైకి నూతన విమాన సర్వీస్ ప్రారంభం
కష్టపడిన వారికి ప్రొత్సాహం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చామని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమన్నారు. గతంలో ఏర్పాటు చేసిన చోటే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని.. వంద రోజుల్లో అన్న క్యాంటీన్ల పునరుద్దరణ జరుగుతుందన్నారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదు, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వెల్లడించారు. కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్ తో… 57 శాతం ఓట్ షేర్ ను సాధించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని మనం కాపాడుకోవాలని నేతలకు సూచించారు. కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.