AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది. ప్రస్తుత చట్టంలో ఉన్న కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణలపై కేసుల నమోదు కోసం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. వైసీపీ పాలనలో అనేక ఎకరాలు అక్రమంగా ఆక్రమించబడినట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేసి, కొత్తగా “ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024” తీసుకురావాలని నిర్ణయించింది.
అలాగే, నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయింపు పై కూడా చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో, 2019లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం మరియు ఆ సమయంలో జారీ చేసిన జీవో 77ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టుల నియామకానికి 2017లో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వేను ప్రాతిపదికగా తీసుకోవాలని కూడా నిర్ణయించాయి.
ఇతర కీలక అంశాలు:
క్రీడా విధానం: కొత్త క్రీడా విధానంపై, స్పోర్ట్స్ కోటాను 2% నుండి 3% కు పెంచే ప్రతిపాదనపై చర్చ జరగనుంది.
ప్రోత్సాహకాలు: ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు రూ. 7 కోట్లు ప్రోత్సాహకం ఇవ్వాలని కూడా కేబినెట్ చర్చించనుంది.
పరిశ్రమలు: ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు భూ కేటాయింపు పై కూడా చర్చ జరగనుంది.
ఈ అంశాలపై మంత్రివర్గం వివిధ నిర్ణయాలను తీసుకుని, వాటిపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది.