Purandeshwari: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెను ప్రారంభిస్తే వినియోగదారులకు వచ్చే సమస్యలు పరిష్కరించడానికి అనేక సాంకేతిక సమస్యలు ఏర్పడతాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను పరిష్కరించడం ద్వారా సమ్మె సమస్యను పరిష్కరించాలని ఆమె సూచించారు. 2022 నుంచి పీఆర్సీ అమలు చేయాలన్న డిమాండును పరిష్కరించాలన్నారు.
Also Read: YSRCP on No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ
విద్యుత్ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించక పోవడం వల్ల విద్యుత్ ఉధ్యోగులు సమ్మెకు దిగుతున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు. సుమారుగా 26 వేలమంది కాంట్రాక్ట్ కార్మికుల జీత భత్యాలను ప్రభుత్వం నేరుగా చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి అవలంభిస్తోందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించారు.