AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అరెస్ట్ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. మోహిత్ రెడ్డిని A-39గా చేర్చారు సిట్ అధికారులు. లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్ట్ చేసింది సిట్. వారంతా విజయవాడ జైల్లో ఉన్నారు. గత వారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అధికారులు… ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించి అతడిని కూడా నిందితుడిగా చేర్చారు. దీంతో మోహిత్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మంగళవారం విచారణకి రానున్న నేపథ్యంలో మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది.
Read Also: Ponguleti Srinivasa Reddy: వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చెబుతున్నాం..
చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఈనెల 25న విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది సిట్. మరోవైపు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ ప్రత్యేక బృందాలు బెంగళూరు, హైదరాబాద్‌లలో గాలిస్తున్నాయి. ఒకవైపు విచారణకు రావాలని నోటీసులు, మరోవైపు అరెస్టు చేయడం కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలతో వ్యవహారం రచ్చగా మారింది. ఇక నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం చెవిరెడ్డి కస్టడీ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు విచారించనుంది.