Pakistan: పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. ఎవరు చంపుతున్నారో..ఎందుకు చంపుతున్నారో అక్కడి ప్రభుత్వానికి అంతుబట్టడం లేదు. కిడ్నాప్ కావడమో, లేకపోతే ఏదైనా పనికోసం బయటకు వల్లే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. బయటకు వెళ్లిన ఉగ్రవాది ప్రాణాలతో ఉంటాడో లేడో తెలియని పరిస్థితి. భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని తమ సొంత ఆస్తులుగా పరిగణిస్తూ.. వారికి రక్షణ కల్పిస్తున్న పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఈ హత్యలు ఎవరు చేస్తున్నారని పాలుపోవడం లేదు. కిడ్నాప్ అయిన వారి కోసం దేశం మొత్తం జల్లెడ పడుతున్నా వారి శవాలు లభిస్తున్నాయి తప్పితే, ప్రాణాలు ఉండటం లేదు.
తాజాగా కరాచీలో భారత వ్యతిరేక ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన మౌలానా రహీం ఉల్లా తారిఖ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఇతను ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కి అత్యంత సన్నిహితుడు. సోమవారం కరాచీలోని ఓరంగీలో శవమై కనిపించాడు. తారీఖ్‌ని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. ఇతడిని ‘‘మౌజిమ్’’ అని కూడా పిలుస్తారు. దీన్ని టార్గెటెడ్ కిల్లింగ్‌గా అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ అధికారులు హతుడికి సంబంధించి మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.
వణుకుతున్న ఉగ్రవాదులు:
పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని అందరికి తెలుసు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. తాజాగా తారిక్ మరణంతో ఈ ఏడాదిలో అక్కడ 19 మంది ఉగ్రవాదులను ఇలాగే హత్య చేశారు. వీరందరికీ కూడా భారత దేశంలో జరిగిన వివిధ దాడుల్లో ప్రమేయం ఉంది. గత వారం ప్రారంభంలో, జమ్మూలోని సుంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై 2018 దాడికి సూత్రధారి అని నమ్ముతున్న ఖ్వాజా షాహిద్ అనే ఉగ్రవాదిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లో కిడ్నాప్ చేసి, తల నరికి చంపేశారు. అక్టోబరులో, మసూద్ అజార్ యొక్క విశ్వసనీయ సభ్యుడిగా కూడా పరిగణించబడే దౌద్ మాలిక్, వజీరిస్థాన్‌లో పట్టపగలు హత్య చేయబడ్డాడు.
వీరే కాకుండా జమాతే ఉద్ దావా, లష్కర్ ఉగ్రవాది హఫీస్ సయీద్ అత్యంత సన్నిహితుడు మాలిక్, ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కూడా గత నెలలో ఇలాగే హత్యలు చేశారు. అయితే చాలా సందర్భాల్లో అక్కడి అధికారులు మాత్రం ఈ హత్యల్లో శత్రుదేశ గూఢచార సంస్థ ప్రమేయం ఉందని చెబుతూ.. పరోక్షంగా భారత్, రా గురించి వ్యాఖ్యానిస్తున్నారు. ఎయిరిండియా విమానం హైజాక్ లో కీలక పాత్ర పోషించిన జైషే ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీం ను కూడా ఇలాగే చంపేశారు. లాహోర్ లో ఖలిస్తాన్ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్వార్ ని కూడా చంపేశారు.