ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7,8 తేదీల్లో మరో అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ప్రకటించారు. ఆయన ఆదివారం విజయనగరంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శించారు. ఓటింగ్‌కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్‌లు, క్యూలెన్లు, పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఏర్పా్ట్లపై ఓట్లరు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి వివరించారు.
READ MORE: Kothapalli Geetha: ప్రచారంలో దూసుకుపోతున్న అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి..
ఈ సందర్భంగా సీఈవో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జాబితాలో పేర్లు లేనివారు, ఓటు కోసం ధరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్‌కు తీసుకువెళ్లి, ఓటు పొందవచ్చునని సూచించారు. ఇలాంటి వారి కోసం ఈ నెల 7,8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. అన్ని ఫెసిలిటేషన్ సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలను, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తయ్యిందన్నారు. వివిధ విభాగాలనుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, సి-విజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదుల అందుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు సుమారు 16000 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 99 శాతం ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్వయంగా తమ కార్యాలయానికే 500 ఫిర్యాదులు అందాయని, వీటిలో 450 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రూ. 450 కోట్ల నగదు, మద్యం, విలువైన పరికరాలు స్వాధీనం..
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.450కోట్లు విలువైన నగదు, మద్యం, విలువైన పరికరాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 12,400 సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రాజకీయంగా సున్నితంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులు సూచనల మేరకు, అదనపు భద్రతా చర్యలు చేపట్టామన్నారు.