అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.
రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు వీరు ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంచంద్రబాబుకు వివరించారు. మృతులంతా రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియడంతో సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Also Read: Lord’s Test: మొదటి గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం.. టీమిండియాకు ఇంగ్లండ్ కోచ్ సవాల్!
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రైల్వేకోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 9 మంది కూలీలు దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో కూలీలు మృతి చెందడం బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.