Bengali Actress Anjana Bhowmick Dies: బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ అంజనా భౌమిక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 79 ఏళ్ల అంజనా.. దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెటరన్ హీరోయిన్ అంజనా గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె కుమార్తెలు బాగోగులు చూసుకుంటున్నారు. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా.. శనివారం తుదిశ్వాస విడిచారు.
అంజనా భౌమిక్ డిసెంబర్ 1944లో బిహార్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు ఆరతి. చదువు కోసం కోల్‌కతా వెళ్లి.. అక్కడే సెటిల్ అయ్యారు. 20 సంవత్సరాల వయస్సులో 1964లో బెంగాలీ చిత్రం ‘అనుస్టూప్ ఛంద’తో అంజన సినీరంగ ప్రవేశం చేశారు. ‘థానా థేకే అస్చీ’ చిత్రంలో స్టార్ హీరోయిన్ అయ్యారు. కహోనా మేఘ్, థానా థేకే అస్చీ, చౌరంగీ, నాయికా సంబాద్, కభీ మేఘ్ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకుంది.
Also Read: Pregnant Woman: మధ్యప్రదేశ్‌లో దారుణం.. గర్భిణిపై సామూహిక అత్యాచారం, ఆపై నిప్పంటించి..!
అనిల్ శర్మ అనే నావికాదళ అధికారిని అంజనా భౌమిక్ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు (నీలాంజనా సేన్‌గుప్తా, చందనా శర్మ) ఉన్నారు. నీలాంజనా ప్రముఖ నటుడు జిష్షు సేన్‌గుప్తాను వివాహం చేసుకున్నారు. నీలాంజనా కూడా చాలా సంవత్సరాలుగా నటనకు దూరంగా ఉంటున్నారు. అంజనా మృతిపట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.