Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే.. అనుకున్న సమయం కంటే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందని చెబుతూ వస్తోంది.. దానికి తోడు గత ఏడాది గోదావరిలో భారీ వరదలు కూడా నిర్మాణ పనులకు ఆటకం కలిగించాయి.. అయితే, ఈ రోజు పోలవరం ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి.. ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించిన ఆయన.. పూర్తి చేయాల్సిన పనులు, నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు.. పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాస ప్యాకేజీ పనుల వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎస్.. అయితే, ఈ ఏడాది చివరకి 5 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిర్దేశిత గడువు ప్రకారం పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్ జవహర్ రెడ్డి.
Read Also: Dharani Portal: ధరణి పోర్టల్తో ప్రజలకు మేలు.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు, ఏపీ జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రకరకాల అవంతరాలు కొనసాగుతోన్న విషయం విదితమే.. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంతకంతకు పెరుగుతుంటే.. పోలవరం మొదటి దశ అంటూ తాజాగా కొత్త మెలికను తెరపైకి తెచ్చింది కేంద్రం.. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి తొలిదశ, మలిదశ అనే ప్రతిపాదనలు ఏవి వినిపించనప్పటికీ.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీ విభజన తర్వాత పోలవరం పనుల్ని 2018నాటికి పూర్తి చేయాలని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ, 2019 నాటికి కూడా ఆ పనులు పూర్తి చేయలేకపోయారు.. ఇక, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ 2022 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని అందిస్తామని ప్రకటించినా.. సాంకేతిక కారణాలతో అది కూడా సాధ్యం కాలేదు.. దీంతో.. అధికార, ప్రతిపక్షాల మధ్య పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణం మీరంటే మీరనే విమర్శల పర్వం కొనసాగుతూ వస్తోన్న విషయం విదితమే.