తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగియనుండటంతో నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుంచి బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం అల్పాహారం తర్వాత 10.30 గంటలకు సోమాజిగూడలోని క్షత్రియ హోటల్ కు చేరుకోనున్నారు. అక్కడే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం మేనిఫెస్టోను ప్రజలకు అమిత్ షా వివరించనున్నారు.
Read Also: Assembly Elections 2023 Live: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పోలింగ్ లైవ్ అప్ డేట్స్
ఇక, ఈ కార్యక్రమం తర్వాత బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అమిత్ షా గద్వాల్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1.20 వరకు గద్వాలలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక, 2.45 నుంచి 3.20 గంటల వరకు నల్గొండ.. కాగా, సాయంత్రం 4.10 నుంచి 4.45 గంటల వరకు వరంగల్ లో నిర్వహించే సకల జనుల విజయ సంకల్ఫ సభల్లో అమిత్ షా పాల్గొని మాట్లాడనున్నారు. వరంగల్ పర్యటన తర్వాత బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ కు 6.10 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 7.45 వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఎమ్మార్పీఎస్ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ మీటింగ్ తర్వాత అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. రాత్రి 8: 15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.