Amit Mishra Said I Dont Have Virat Kohli’s Phone Number: భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత విరాట్ పూర్తిగా మారిపోయాడని, ఆటగాళ్ల స్నేహానికి దూరమయ్యాడన్నాడు. ప్రస్తుత జట్టులో అతడికి ఎక్కువగా స్నేహితులు లేరని, ఎప్పటినుంచో తాము కలిసి ఆడుతున్నా విరాట్ ఫోన్ నెంబర్ కూడా తనకు తెలియదన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఏ మాత్రం మారలేదని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.
తాజాగా యూట్యూబర్ శుభంకర్ మిశ్రా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్ మిశ్రా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య ఉన్న తేడాను వివరించాడు. ‘నేను అబద్ధాలు చెప్పను. క్రికెటర్‌గా విరాట్ కోహ్లీని నేను చాలా గౌరవిస్తాను. కానీ ఒకటి.. ఎందుకు కోహ్లీకి చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ వ్యక్తిత్వాలు బిన్నంగా ఉంటాయి. నేను రోహిత్‌ని మొదటిసారి కలిసినప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పటికీ కలిసినా అలానే ఉంటాడు. కానీ కోహ్లీ మాత్రం పూర్తిగా మారిపోయాడు. నేను ఇన్నేళ్లుగా భారత జట్టులో భాగం కాలేదు. అయినా కూడా రోహిత్‌ను ఐపీఎల్‌లో లేదా మరేదైనా ఈవెంట్‌లో కలిసినప్పుడు నాతో సరదాగా మాట్లాడుతుంటాడు’ అని తెలిపాడు.
Also Read: Brian Lara-Sachin: అతడి టాలెంట్‌కు.. సచిన్, నేను దరిదాపుల్లో కూడా లేము: లారా
‘నేను, రోహిత్ ఒకరిపై ఒకరం జోక్స్ వేసుకుంటాం. అతను స్టార్ ప్లేయర్‌గా ఉన్నా తనతో నా ర్యాపో బాగానే ఉంది. రోహిత్ కెప్టెన్‌గా ఉన్నాడు, ప్రపంచకప్ గెలిచాడు, ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు. అయినా రోహిత్ మారిపోలేదు. విరాట్ కోహ్లీ మాత్రం చాలా మారాడు. మేం ఇద్దరం మాట్లాడుకోక చాలా రోజులయ్యింది. ఫేమ్, డబ్బు వచ్చినప్పుడు చాలా మంది తమ సన్నిహితులను మర్చిపోతుంటారు. నేను అలా కాదు. 14 ఏళ్ల నుంచి నాకు చీకూ (కోహ్లీ పెట్ నేమ్) తెలుసు. రాత్రి పూట సమోసాలు, పిజ్జా తినేవాడు. కోహ్లీ, చీకూకు చాలా తేడా ఉంది. ఎప్పుడైనా నన్ను కలిస్తే చీకూలా కాకుండా కోహ్లీలా వ్యవహరిస్తాడు’ అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు. కోహ్లీ సారథ్యంలో అమిత్ 9 టెస్ట్‌లు, 7 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.