హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై రేపటి నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్ కింద స్మశాన వాటికలు రెండు వైపులా ఉండటంతో.. రోడ్డు విస్తరణ ఇబ్బందిగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. అంబర్‌పేట ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. గోల్నాక నుండి అంబర్‌పేట ఇరానీ హోటల్ వరకు ఫ్లైఓవర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే.
అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘చాదర్ ఘట్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారికి గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రోడ్డు వైండింగ్ చేయడం జరిగింది. అంబర్‌పేట చే నెంబర్ వద్ద రెండు వైపులా శ్మశాన వాటిక ఉండటంతో రోడ్డు వైండింగ్ కుదరలేదు. నేను అంబర్ పేట శాసనసభ్యుడిగా, ఎంపీగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. శ్మశాన వాటిక ఉన్నందున ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కోరాను. ఈ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. స్థానిక ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ జాతీయ రహదారి గుండా వెళ్లే వరంగల్, ఖమ్మం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ప్రధాని మంత్రిని అడిగినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకొని మంజూరు చేశారు’ అని తెలిపారు
‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూర్తిగా సహకరించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మిగతా ఐదు చోట్ల భూసేకరణ చేసి సహకరించాల్సిన అవసరం ఉంది. ఒకచోట భూసేకరణకు సంబంధించి రూ.2 కోట్ల 51 లక్షలు చెక్కు తీసుకున్న తర్వాత కూడా స్థలం నేషనల్ హైవే అథారిటికి అప్పగించలేదు. దాన్ని త్వరగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. జీహెచ్ఎంసీ, నేషనల్ హైవే అధికారులతో ఇటీవల నేను ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఫ్లైఓవర్ కింద మంచి రోడ్డు వేయడంతో పాటు, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ చేయాలని నేను అధికారులను సూచించాను. అప్పుడు వాళ్లు స్పందిస్తూ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సాధ్యం కాదని చెప్పారు. అప్పుడు నేను స్పందిస్తూ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ట్రాఫిక్ ను పైనుంచి పంపి.. కింద రోడ్డు, బ్యూటిఫికేషన్ పనులు చేయాలని సూచించాను. కాబట్టి మిగిలిపోయిన ఆరు చోట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి నేషనల్ హైవే అథారిటికి అప్పగిస్తే ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేస్తాం’ అని కిషన్ రెడ్డి చెప్పారు.
‘ఈ శివరాత్రి నుంచి ఫ్లైఓవర్ మీనుంచి ట్రాఫిక్ వదిలి.. కింద రోడ్డు నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని నేను అధికారులను ఆదేశించాను. ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించి నేను గతంలో కేసీఆర్ కు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనేక ఉత్తరాలు రాశాను. భూసేకరణను వేగవంతం చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం వెంటనే స్పందించి.. మిగిలిపోయిన ఆరు చోట్ల భూసేకరణను చేపట్టాలని నేను కోరుతున్నాను. ఈ ఫ్లైఓవర్ కోసం ఇప్పటి వరకు రూ.338 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఏండ్ల తరబడి ట్రాఫిక్ కష్టాలకు రేపటి శివరాత్రితో కొంత ఉపశమనం కలుగుతుంది”అని కిషన్ రెడ్డి అన్నారు.