Ambati Rayudu Hails Yuvatha-Haritha programme in AP: సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని, అద్భుత నగరంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యువత-హరిత’ కార్యక్రమానికి రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రి తిలక్ రోడ్లో నూతనంగా నిర్మించిన డివైడర్లలో ఎంపీ భరత్‌తో కలిసి రాయుడు మొక్కలు నాటారు. నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యువత-హరిత కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో అంబటి రాయుడు మాట్లాడుతూ… ‘యువత-హరిత చాలా అద్భుతమైన కార్యక్రమం. ఒక మహా యజ్ఞంలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలి. రాజమండ్రి చాలా అభివృద్ధి చెందింది. యువకులు రాజకీయాలలోకి వస్తే.. అభివృద్ధి ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపించారు. యువత కలిసిమెలిసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకు వెళ్లేందుకు ముందుకు రావాలి. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. రాజమండ్రి నగరంలో ఒకవైపు హరిత విప్లవం, మరోవైపు క్రీడారంగంపై యువత దృష్టి సారించేలా ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఎంపీ భరత్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తుండటం శుభ పరిణామం. రాజమండ్రి గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలి’ అని ఆకాంక్షించారు.
Also Read: New Zealand: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!
‘యువత హరిత కార్యక్రమానికి క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్, కమిషనర్లు అభివృద్ధికి అన్ని విధాలా సహకరించడం వల్లనే నగరాన్ని ఇంత శోభాయమానంగా తీర్చిదిద్దాం. రాజమండ్రి నగరంలో ఫ్లడ్ లైట్స్ తో రెండు క్రికెట్ స్టేడియంలు రాబోతున్నాయి. అలాగే నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే అది ప్రారంభోత్సవం కానుంది. ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను దత్తత తీసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి’ ఎంపీ భరత్ పిలుపునిచ్చారు.