ఆకు కూరల్లో ఎక్కువగా తోటకూరను కూడా బాగా తింటారు.. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. తోట కూరను ఎక్కువ మంది తీసుకుంటారు.. ఇక రైతులు కూడా వీటిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పంటకు శీతాకాలం అనుకూలం.. ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. ఉదజని సూచి 6.0 – 7.0 ఉన్న నేలలు అనుకూలం. నీరు నిలిచే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు పనికిరావు. నేలను 4 – 5 సార్లు బాగా దుక్కిదున్నాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మళ్ళను బాగా చదునుగా చేసుకోవాలి.. తోటకూరని ఎక్కువగా వర్షాకాలం అయితే జూన్ నుండి అక్టోబరు నేలలో సాగు చేస్తారు. వేసవికాలంలో మే నేలలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 800 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నటి ఇసుకతో కలిపి వేయాలి. నారుమడిలో పోసుకొని కూడా సగం అడుగు దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి..
తోటకూరలో రకాలు..
కో1: ఆకులు,కాండం లావుగా ఉండి కండ కలిగి ఉంటాయి. ఒక ఎకరానికి 3- 3.5 టన్నుల దిగుబడిని 25 రోజులలో ఇస్తుంది. ఆకులు వెడల్పుగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. విత్తనాలు చిన్నవిగా, నల్లగా ఉంటాయి..
కో 2: ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి. కాండం లేతగ, మృదువుగా ఉంటుంది. విత్తిన 30 రోజులకు కోతకు వస్తుంది. కాండం కూడ కూరగా పనికి వస్తుంది. ఎకరాకు 4-5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.. ఇక ఈ విత్తనాలు కాస్త పెద్దగా ఉంటాయి..
ఎరువుల యాజమాన్యం :
ఈ పంటకు ఎరువులు కూడా బాగా ఉండాలి.. ఎకరాకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ల నిచ్చే ఎరువులను వేసి బాగా కలియదున్నాలి.. ఈ పంట విత్తిన 15 – 20 రోజుల తర్వాత 20గ్రా యూరియా, ఒక లీటరు నీటికి, 20 పి.పి.యమ్ జిబ్బరెల్లిక్ ఆసిడ్ , ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణం పిచికారి చేస్తే అధిక లాభాలు వస్తాయి. అంతేకాక కొంతమేర నత్రజని ఆదా అవుతుంది. కలుపు నివారణకు ఎకరాకు డ్యుయల్ మందును తేలిక నేలలకు ఒక లీటరు లేదా బరువు నేలలకు 1.5 లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని విత్తినలు నాటిన 48 గంటలలో భూమిపై పిచికారి చేయాలి. భూమిలో తేమను బట్టి 7 – 10 రోజుల వ్యవధితో నీరు కట్టాలి.. అలాగే వేసవిలో అయితే 5 రోజులకు నీరు పెట్టాలి..
పెద్ద పురుగులు ఆకులను కొరికి వేయడం వలన ఆకులు పనికి రాకుండా పోవడమేగాక, మార్కెట్ లో సరైన రేటురాదు. వీటి నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకులను కోసి అమ్మవచ్చు.. ఇక విత్తిన రకాన్ని బట్టి కోత కూడా వస్తుంది..10 రోజులకు ఒక కోత చొప్పున 90 రోజులలో 4 – 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.. మార్కెట్ లో ఎప్పుడు తోటకూరకు డిమాండ్ ఉండటంతో మంచి లాభాలను పొందవచ్చు..